Ys Jagan Political Alliance.. ‘సింగిల్ సింహం’ కహానీలను కట్టిపెట్టి, కలిసొచ్చే రాజకీయ శక్తుల్ని కలుపుకుపోవాలనే ఆలోచనతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారట.
2029 ఎన్నికల్లో సంచలన విజయమే లక్ష్యంగా, ‘పొత్తుల చర్చలకు’ వైసీపీ అధినాయకత్వం తెరలేపినట్లు కనిపిస్తోంది. ముందుగా వామపక్షాలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై గళం విప్పేందుకే వామపక్ష నాయకులతో భేటీ తప్ప, పొత్తుల చర్చలేమీ కాదంటూ వైసీపీ నుంచి స్పష్టత వస్తున్నా, ‘పొత్తు’ ప్రచారాలు ఆగడంలేదు.
వాస్తవానికి, వైసీపీ – వామపక్షాల మధ్య ‘స్నేహం’ కొత్తదేమీ కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక తొలిసారి ఎదుర్కొన్న సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలతో కలిశారు.
తెలంగాణలో వామపక్షాలతో కలిసి పోటీ చేసి, ఓ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. కొన్ని ఎమ్మెల్యే సీట్లనూ వైసీపీ గెలుచుకుంది. వామపక్షాలనీ కొన్ని సీట్లలో గెలిపించింది.
Ys Jagan Political Alliance.. వామపక్షాల పంచన వైసీపీ చేరడం ఖాయమే..
అసలిప్పుడు వైసీపీకి వామపక్షాలతో కలవాల్సిన అవసరమేముంది.? వామపక్షాలకు ఆంధ్ర ప్రదేశ్లో వున్న ఓటు బ్యాంకు ఎంత.? అన్న విషయాలపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఎన్నికలంటే, ఒక్క ఓటు కూడా కీలకమే.! సో, వామపక్షాలకున్న చిన్న ఓటు బ్యాంకు అయినా, వైసీపీకి అడ్వాంటేజ్ అవ్వొచ్చు. పైగా, వామపక్షాలేమీ వైసీపీ నుంచి ఎక్కువ సీట్లు ఆశించవు కూడా.
ఇంతకీ, కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ జగన్ దగ్గరవుతున్నారా.? అంటే, రాజకీయాల్లో శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులు.. ఎవరూ వుండరన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్లో వైసీపీ విలీనమంటూ ఓ పక్క పుకార్లు వినిపిస్తున్నా, వైఎస్ జగన్ ఆ రిస్క్ చెయ్యరు. కాంగ్రెస్తో పొత్తు వల్ల లాభ నష్టాలపై వైఎస్ జగన్, పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే చర్చిస్తున్నారన్నది ఓ వాదన.
ఏమో, ఎన్నికల నాటికి బీజేపీనే తమతో కలిసొస్తే.? అన్న కోణంలో కూడా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ – వామపక్షాలు.. ఈ రెండిట్లో వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాలే బెస్ట్ ఆప్షన్ అట.
ఇంకా చాలా సమయం వుంది 2029 ఎన్నికలకి. కానీ, రాజకీయ పార్టీలు తమదైన రాజకీయ వ్యూహాలకు ఇప్పటినుంచే పదును పెట్టాల్సి వుంటుంది. ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అన్నట్లుగా వ్యూహాలు రచించడం తప్పదు.
11 సీట్లకు 2024 ఎన్నికల్లో పరిమితమైపోయిన వైసీపీ, మళ్ళీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2019 ఎన్నికల్లో దక్కించుకున్నట్లుగా దక్కించుకోవాలని తహతహలాడుతోంది.
ఎటూ 40 శాతం ఓటు బ్యాంకు ఇంకా తమతోనే వుందని వైసీపీ బలంగా నమ్ముతోంది గనుక, చిన్న సాయం ‘పొత్తు’ రూపంలో అందితే చాలు, అద్భుతాలు సాధించగలమని.. ఆ కోణంలో ప్రయత్నాల్ని ముమ్మరం చేయడంలో వింతేముంది.?
