Chandrahas Prabhakar Attitude Star.. నటుడు ప్రభాకర్ గురించి చెప్పాలంటే, ముందుగా ‘ఈటీవీ’ ప్రస్తావన తప్పదు.! ఈటీవీ ప్రభాకర్గానే బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు మరి.!
ఓ వివాదాస్పద వ్యవహారానికి సంబంధించి ఈటీవీ నుంచి ప్రభాకర్ని గెంటేశారన్న ప్రచారం కూడా వుంది.! అది మళ్ళీ వేరే చర్చ.
సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ, అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపిస్తున్నాడు ప్రభాకర్. తన కుమారుడు చంద్రహాస్ని వెండి తెరకు ప్రభాకర్ పరిచయం చేశాడు కొన్నాళ్ళ క్రితం.
‘ఆటిట్యూడ్ స్టార్’ అని తనకు తానే పేరు పెట్టేసుకున్న చంద్రహాస్, ‘బరాబర్ ప్రేమిస్తా’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో చంద్రహాస్, ఓ బూతు పాట పాడాడు. ఆ పాట కాస్తా వివాదాస్పదమయ్యింది. పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది చంద్రహాస్ చుట్టూ.
మామూలుగా ఇలాంటి వివాదం ఏదన్నా తెరపైకొస్తే, సింపుల్గా ‘క్షమాపణ’ చెప్పేస్తారు ఎవరైనా. కానీ, అతను ఆటిట్యూడ్ స్టార్ కదా.. తన బూతుల్ని సమర్థించుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు.
తనను తిట్టినవారిని బెదిరించాడు.. తూలనాడాడు చంద్రహాస్. సోషల్ మీడియాలో ఎవరో తనను తిడుతున్నారు కాబట్టి, సినీ వేదిక సాక్షిగా, పాటతో వాళ్ళని తిట్టాలనుకున్నాడట చంద్రహాస్.
చంద్రహాస్ మీద పోలీసులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. చంద్రహాస్ కూడా, లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ఓ జర్నలిస్టుకి హెచ్చరిక జారీ చేసేశాడు.!
ఇంతకీ, సదరు సినీ ఈవెంట్లో.. దర్శక నిర్మాతలు, సినిమాకి సంబంధించిన నటీనటులు, ఇతర ప్రముఖులు.. ఎవరూ చంద్రహాస్ని వారించలేకపోయారా.?
ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదంటున్నాడు చంద్రహాస్. పోనీ, ఆ బూతుల ప్రవాహం తర్వాత అయినా, అదే వేదికపై అతనితో క్షమాపణ చెప్పించి వుండాలి కదా.? అదీ జరగలేదు.
సినిమా ప్రమోషన్ కోసమే బూతులు వాడినట్లు, చంద్రహాస్ తీరుని బట్టి అర్థమవుతోంది. అయినాసరే, ఇంతలా దిగజారిపోవాలా.?
చిత్రమేంటంటే, సినిమాలో ప్రదర్శించబోయే పాటలో బూతులు వుండవట. ఇదీ, ఈ స్థాయికి ఆటిట్యూడ్ స్టార్ దిగజారిపోయాడన్నమాట.
ఆటిట్యూడ్ అంటే.. దిగజారిపోవడమని కొత్త అర్థం చెప్పాడు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా మొహాన ఉమ్మేసేలా వుంది చంద్రహాస్ తీరు.
నటుడు ప్రభాకర్, తన కుమారుడి విషయమై వివరణ ఇచ్చుకుంటే మంచిది.
