MaViGun Jagan Vs Amaravati.. 2029 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో మొదటి అంశాన్ని తాజాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫిక్స్ చేసేశారు.!
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్ని కలుపుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో గెలిచాక, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్. ఆ ప్రతిపాదనకు చుక్కెదురయ్యింది.
దాంతో, అసెంబ్లీ నుంచి ఆ ప్రతిపాదనను అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అదంతా, అమరావతి రైతులు అప్పటి ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్న విజయమే.
MaViGun Jagan Vs Amaravati.. అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు.!
ప్రస్తుతానికైతే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి. ఇటీవలే కేంద్రం, రాజధాని అమరావతిని నోటిఫై చేసింది. ఈ మేరకు గెజిట్ కూడా విడుదలైంది.
రాజధాని అమరావతిలో, అధికారిక భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది కూటమి ప్రభుత్వ హయాంలో. 2019 నుంచి 2024 మధ్యకాలంలోనే, ఇవన్నీ పూర్తవ్వాల్సి వుంది.
మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్, ‘మావిగన్’ అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే, ‘మావిగన్’ రాజధాని అన్నది వైఎస్ జగన్ ఉవాచ.
‘మావిగన్’ని రాజధానిగా కోరుకునేవారు మాత్రమే వైసీపీకి ఓటేస్తారన్నది వైఎస్ జగన్ తాజా వాదన. అమరావతిని రాజధానిగా అంగీకరించేవారు చంద్రబాబుకి ఓటేస్తారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు 2026లో వున్నాం మనం. ఆ లెక్కన, ఇంకో మూడేళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో వుంటుంది. సో, ఈ మూడేళ్ళలో రాజధానికి సంబంధించి మరిన్ని నిర్మాణాలు ఓ కొలిక్కి వస్తాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ, 2028 అర్థ భాగానికల్లా రాజధాని అమరావతి ఓ కొలిక్కి వస్తుందని చంద్రబాబు సర్కార్ బలంగా నమ్ముతోంది. అదే జరిగితే, జగన్ మావిగన్‌కి అర్థమే వుండదు.
వైఎస్ జగన్ గతంలో చెప్పిన మూడు రాజధానుల్లో అమరావతి కూడా వున్నప్పటికీ, ఆ అమరావతిపై వైసీపీ నేతలతో విషం చిమ్మించారాయన.
అమరావతి అంటే, స్మశానం అనీ, ఎడారి అనీ.. ఇలా ఏవేవో పిచ్చి ప్రేలాపనలు జగన్ హయాంలో అప్పటి మంత్రులు చేశారు.
ఓ వైపు తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని ఇప్పుడు వైసీపీ నేతలు కొందరు చెబుతోంటే, అమరావతి వర్సెస్ మావిగన్.. అంటూ, జగన్ తన స్టాండ్ భయంకరంగా మార్చేసుకున్నారు.
