Home » ముద్రాభిప్రాయమ్: ‘ఏఐ డీప్ ఫేక్’ మార్ఫింగ్‌ తీవ్రవాదాన్ని ఆపేదెలా.?

ముద్రాభిప్రాయమ్: ‘ఏఐ డీప్ ఫేక్’ మార్ఫింగ్‌ తీవ్రవాదాన్ని ఆపేదెలా.?

by Mudra369 Editorial Desk
0 comments
Janhvi Kapoor Rashmika Mandanna

AI Deepfake Morphing Terror.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.! భలేగుందే.. అని ఒక్కోసారి సెలబ్రిటీలూ మురిసిపోతున్నారు. అంతలోనే, దారుణం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

మొన్నటికి మొన్న, ‘ఎయిటీస్ ట్రెండ్’‌లో పాల్గొన్నారు పలువురు ప్రముఖులు. సినీ, రాజకీయ ప్రముఖులూ ఈ లిస్టులో వున్నారు.

‘మీ ఫొటోల్ని, ఇలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌కి ఇవ్వొద్దు..’ అని పోలీస్ అధికారులు హెచ్చరించినా ఎవరూ వినలేదు.

ఇంతలోనే, జాన్వీ కపూర్ మార్ఫింగ్ వీడియో ‘ఏఐ – డీప్‌ఫేక్’ టెక్నాలజీతో బయటకు వచ్చింది. దాంతో, అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

‘ఎయిటీస్ ట్రెండ్’ కంటే ముందు కూడా, చాలా ‘ట్రెండ్స్’ వచ్చాయి.. ఇకపైనా వస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌‌ని విచ్చలవిడిగా వాడుతూనే వుంటాం.. తగ్గేదే లేదు.!

Anasuya Bharadwaj Mrunal Thakur
Anasuya Bharadwaj Mrunal Thakur

ఇక్కడ తప్పెవరిది.? ఎవరు తప్పు చేస్తున్నారు.? శిక్ష ఎవరికి పడుతోంది.? ఔను, తప్పు చేసినవారిలో కొందరికి శిక్షలు పడుతుంటాయి. కానీ, అందరికీ కాదు కదా.!

భయమెక్కడి నుంచి వస్తుంది.? తన పట్ల అసభ్యకరమైన రీతిలో వ్యవహరిస్తున్నారంటూ కొందరు నెటిజన్స్‌పై గతంలో అనసూయ భరద్వాజ్ పోలీసులను ఆశ్రయించింది.

AI Deepfake Morphing Terror.. అనసూయ ఆవేదన.. అరణ్య రోదన..

అనసూయ భరద్వాజ్ ఫిర్యాదు నేపథ్యంలో కొన్ని అరెస్టులూ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అనసూయ కూడా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది.

కానీ, ఆ తర్వాత ఆ వేధింపులు ఆగాయా.? ఇంకా కొనసాగుతూనే వున్నాయి. మృణాల్ ఠాకూర్ సహా చాలామంది సినీ తారలు న్యాయ పోరాటం చేసి, అలసిపోయారు.

Rukmini Vasanth Trisha Krishnan
Rukmini Vasanth Trisha Krishnan

చాలకాలం క్రితం, సినీ నటి త్రిష ఫేక్ వీడియో అప్పట్లో పెను సంచలనం. ఆమె న్యాయ పోరాటం ఫలించలేదు. రష్మిక మండన్న మీద డీప్ ఫేక్ వీడియో గురించి తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులేమీ మారలేదు.

ఆ మాటకొస్తే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. ఈ స్థాయి వ్యక్తులకూ సోషల్ వేధింపులు తప్పట్లేదు.

రాజకీయ నాయకుల ఫొటోలు, వీడియోల్ని జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసేవారి అరెస్టుల గురించి తరచూ వింటూనే వున్నాం. కానీ, ఆ అరెస్టులతో ఏదీ మారడంలేదు.

జూనియర్ ఎన్టీయార్ రంగంలోకి దిగి, జాన్వీ కపూర్‌కి బాసటగా నిలుస్తూ ‘న్యాయ పోరాటం’ మొదలు పెట్టాడు. ఆహ్వానించదగ్గ విషయమే ఇది. కానీ, ఫలితం పాజిటివ్‌గా వుంటుందా.? వుండదు.

సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చినా..

సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చినా, పైరసీని ఆపలేకపోయింది. ఇదీ అంతే.! ఈ మహమ్మారికి కూడా విరుగుడు లేదు.

దేశవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో నిషేధం వుంది. అదీ, కొన్నాళ్ళ క్రితమే అమల్లోకి వచ్చింది. లేకపోతే, సోషల్ మీడియా తెరిస్తే, అంతా అసభ్యకరమైన కంటెంటే కనిపించేది.

ట్విట్టర్ (ఇప్పుడు ‘ఎక్స్’) వేదికగా అడల్ట్ కంటెంట్ మీద నిషేధాజ్ఞలు వున్నా, ఏదో ఒక రూపంలో.. ఆ కంటెంట్ సర్క్యులేట్ అవుతూనే వుంది.

నెటిజనం కూడా తెలివి మీరిపోయారు.! అక్రమ మార్గాల్లో, అడల్ట్ కంటెంట్‌ని సర్క్యులేట్ చేస్తూనే వున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.!

ఈ సోషల్ భూతాన్ని అంతమొందించడం అసాధ్యమేమీ కాదు.! కాకపోతే, పాలకులకే చిత్తశుద్ధి వుండాలి.

బాధితులుగా మారుతున్నది సినీ, రాజకీయ ప్రముఖులే కాబట్టి.. ఏ రకంగానూ ఏఐ టూల్స్‌ని ప్రోత్సహించకూడదు.. ఏ ట్రెండ్‌లోనూ భాగస్వాములు కాకూడదు.

చట్టాలు చేసే రాజకీయ నాయకులు, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. కొత్త చట్టాలు తేవాల్సిన పని లేదు, వున్న చట్టాల్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలి.

Pooja Hegde Shruti Haasan
Pooja Hegde Shruti Haasan

‘కూలీ’ సినిమాలో పూజా హెగ్దే, ‘మోనిక’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేస్తే, దాన్నీ డీప్ ఫేక్ చేశారు జుగుప్సాకరంగా. శృతి హాసన్ కూడా డీప్ ఫేక్ మార్ఫింగ్ బాధితురాలే.

జాన్వీ కపూర్ డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో ఎంత మంది చూశారన్న విషయం పక్కన పెడితే, ‘డీఎం చెయ్’ అంటూ సోషల్ మీడియాలో కనిపించిన ‘రిక్వెస్టులు’ పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి.

ఇంత బరితెగింపు ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడనిది నిస్సందేహంగా. అరెస్టులు చేసుకుంటూ పోతే, దేశంలోని జైళ్లు చాలవేమో.. ఈ సోషల్ క్రైమ్‌ విషయంలో.

కానీ, ఈ రోగానికి వ్యాక్సిన్ ఖచ్చితంగా కనిపెట్టాలి.. అదీ, వీలైనంత త్వరగా. రోగం అందామా.? తీవ్రవాదం కంటే, పెద్ద పదం ఏదైనా, దీనికోసం కనిపెట్టాలా.?

Rashmika Mandanna Janhvi Kapoor
Rashmika Mandanna Janhvi Kapoor

చివరగా.. సినిమా హీరోయిన్లను ‘గ్లామర్’ మసుగులో వెండితెరపై అత్యంత అసభ్యకరమైన రీతిలో చూపించడం తెలిసిన విషయమే.

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అదే గ్లామర్ పేరుతో వల్గర్ ఫొటోల్ని షేర్ చేయడం కూడా డిబేటబుల్ అంశంగా మారింది.

స్త్రీల వస్త్రధారణపై మగాళ్ళు లెక్చర్లు ఇవ్వడమేంటి.? అంటూ, జరిగే రచ్చ మామూలే. డీప్ ఫేక్ మార్ఫింగ్ మీద చర్చ జరుగుతున్న సమయంలో, ఈ ‘గ్లామర్’ చర్చ కూడా నడుస్తుండడాన్ని ఎలా చూడాలి.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group