Rafale Vs Tejas Delay.. పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ.! సొంత బిడ్డేమో చులకన.! రాఫెల్ యుద్ధ విమానం విషయంలో, తేజస్ తేలికపాటి యుద్ధ విమానం విషయంలో.. ఈ పోలిక సరైనదేనా.?
భారత దేశ రక్షణ అవసరాల నిమిత్తం, వాయసేన ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.!
ఇంకో వందకు పైగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క, స్వదేశీ యద్ధ విమానం తేజస్, ఇంకా బాలారిష్టాల్ని అధిగమించలేకపోతోంది.
తేజస్ ఎంకె1 ఇప్పటికే వాయసేనలో చేరి సేవలు అందిస్తుండగా, దానికి అదనపు హంగులు సమకూర్చి తయారు చేసుకున్న తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానం, ఇంకా సైన్యంలో చేరలేదు.
Rafale Vs Tejas Delay.. చిన్నదేగానీ.. చిచ్చరపిడుగు..
వాస్తవానికి, వాయసేన అవసరాల రీత్యా, తేజస్ అత్యంత ప్రాముఖ్యమైన యుద్ధ విమానం.! తేలికపాటి యుద్ధ విమానమే అయినా, అత్యంత శక్తివంతమైనది.
రాఫెల్నీ, తేజస్నీ ఒకే తీరున చూడలేం.! రాఫెల్ పెద్దది.! రాఫెల్ లెక్కలు వేరు. దాన్ని తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానంతో పోల్చడం సరికాదు.
తేజస్ ఎంకె2 యుద్ధ విమానం కాస్త పోల్చదగ్గది రాఫెల్ యుద్ధ విమానంతో. అయినప్పటికీ, తేజస్ ఎంకె2 కంటే కూడా, రాఫెల్ పెద్దది.!
ఇప్పుడీ కొత్త రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నేపథ్యంలో, మన తేజస్ ఎంకె2 ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందన్న వాదన తెరపైకొచ్చింది. ఈ వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తేజస్ ఎంకె1ఎ సిరీస్లో దాదాపు 180 యుద్ధ విమానాల్ని సైన్యంలోకి చేర్చుకోవాల్సి వుంది.
దాదాపు 20కి పైగా యుద్ధ విమానాలు తయారై వున్నా, ఇంజిన్లు లేక, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో.. వాటి డెలివరీలపై సందిగ్ధత వుంది.
మరోపక్క, తేజస్ ఎంకె2 ఈ పాటికే గాల్లోకి ఎగిరి వుండాలి.. పరీక్షల నిమిత్తం.! ఇంకో రెండు మూడేళ్ళలో తేజస్ ఎంకె2 కూడా అందుబాటులోకి రావాల్సి వున్నా, అదీ అనుమానమే.
పోనీ, రాఫెల్ ఇప్పుడు బుక్ చేస్తే.. వెంటనే దిగమతి అయిపోతాయా.? అంటే, అదీ లేదు.! ఒప్పందాలు కార్యరూపం దాల్చి, తొలి విమానం ఇక్కడికి రావడానికి చాలా సమయమే పడుతుంది.
అనుమానాలు.. విశ్లేషణలు..
ఈలోగా రకరకాల విశ్లేషణలు, బోల్డన్ని అనుమానాలు.. సర్వసాధారణమే.! దేశ రక్షణ అవసరాల నిమిత్తం, అత్యాధునిక యుద్ధ విమానాలు అవసరమే.
కానీ, తేజస్ ఎంకె1 యుద్ధ విమానం కొన్నాళ్ళ క్రితం దుబాయ్లో ప్రమాదానికి గురైన దరిమిలా, భద్రతా సమీక్షలు.. తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానం సైన్యంలో చేరడాన్ని కొంత ఆలస్యం చేసి వుండొచ్చు.
దేశానికి అన్ని రకాల యుద్ధ విమానాలూ ఇప్పటికిప్పుడు తక్షణావసరాలే.! దశాబ్దాల తరబడి నడిచిన నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నామంతే.!
యుద్ధ విమానాల తయారీ అంటే రాత్రికి రాత్రి జరిగిపోయే ప్రక్రియ కాదు.! పైగా, యుద్ధ విమానం పూర్తి స్థాయిలో తయారయ్యాక, చిన్న మార్పు చేయాల్సి వచ్చినా.. అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం.
రాఫెల్ ఖర్చుతో, బోల్డన్ని తేజస్ యుద్ధ విమానాల్ని తయారు చేసుకోవచ్చన్నది నిజమే. కానీ, రాఫెల్ అవసరం సైన్యానికి చాలా ఎక్కువ. అది పోషించే పాత్ర భిన్నమైనది.
ఇంజిన్ అనేది అతి ముఖ్యమైన వ్యవహారమిక్కడ. ఆ ఇంజిన్ మనం తయారు చేసుకోలేకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు.
ఇంజిన్ తయారీలో ముందడుగు పడితే, దేశంలో యుద్ధ విమానాల తయారీ.. ఇంకో లెవల్లో వుంటుంది. అప్పటిదాకా.. ఇలా పిల్లిమొగ్గలేయాల్సిందే. ఇంకొకరిపై ఆధారపడాల్సిందే.