Blast Zone Telugu Review.. సాధారణంగా సినిమాల్లో హీరో బీభత్సమైన ఫైటింగులు చేసేస్తుంటాడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే.!
అరుదుగా, హీరోయిన్ కూడా ఫైటింగులు చేస్తుంటుంది. విలనిజం పండాలంటే, దాదాపుగా హీరోతో సమానంగానే విలన్ కూడా ఫైటింగులు అదరగొట్టెయ్యాలి.
కానీ, ఓ సినిమాలో దాదాపుగా నటీనటులంతా ఫైటింగులు అదరగొట్టేస్తే, బ్లాస్టింగ్ పెర్ఫామెన్సెస్.. అనాలేమో. హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం, ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్.
మన ఇండియన్ సినిమా నుంచి ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్.. చాలా అరుదుగానే చూస్తుంటాం. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బ్లాస్ట్ జోన్’.!
‘బ్లాస్ట్ జోన్’ సినిమాకి తెలుగులో థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా, అంత పాజిటివిటీ ఏం కనిపించలేదు. సినిమా వచ్చింది, వెళ్ళిపోయింది.
కానీ, ఓటీటీలో తెలుగు సహా పలు భాషల్లో ‘బ్లాస్ట్ జోన్’ విడుదలయ్యాక, ‘వావ్.. వారెవ్వా..’ అంటూ, సంభ్రమాశ్చర్యాలతో కూడిన రివ్యూలు కనిపిస్తున్నాయి.
తెలుగులో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తున్న సినిమా కూడా ఇదే కోవలో తెరకెక్కిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ‘బ్లాస్ట్ జోన్’ చూశాక, ఆ సినిమాలో కంటెంట్ కాస్త మార్చాల్సి వచ్చిందట.
Blast Zone Telugu Review.. ఇంతకీ.. ‘బ్లాస్ట్ జోన్’ కథా కమామిషు ఏంటంటే..
ఓ కుటుంబానికి ఓ కష్టమొస్తుంది.. ఆ కష్టం నుంచి ఆ కుటుంబం సమైక్యంగా ఎలా గట్టెక్కిందన్నదే సినిమా.! మన కోసమే కాదు, పరుల కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పే కథ ఇది.
కుటుంబానికి ఏదన్నా కష్టమొస్తే, కుటుంబ సభ్యులంతా చేతులు కలిపి, ఎంత పెద్ద కష్టాన్నయినా అధిగమించాలని చెప్పే మంచి మెసేజ్ వున్న సినిమా ఇది.
అన్నిటికీ మించి, ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. మహిళ ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పే సినిమా ‘బ్లాస్ట్ జోన్’.!
హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కాబట్టి, యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చాలా పద్ధతిగా ఫైట్స్ చేసేశాడు అర్జున్.
ఇంకోపక్క, అర్జున్ కూతురుగా నటించిన ప్రీతి ముకుందన్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్‌ట్ లెవల్ అంతే.
మరోపక్క, అర్జున్ భార్యగా నటించిన అభిరామి అయితే, మైండ్ బ్లోయింగ్.. అనే రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్‌లో దుమ్ము రేపింది. కుటుంబంలో ఇంకో ఫైటర్ కూడా వున్నాడు.
విలన్స్‌లోనూ అంతే, ఎవరికి వారు.. అస్సలు తగ్గలేదంతే. ఒక్కమాటలో చెప్పాలంటే, అందరూ చెలరేగిపోయారు ఈ యాక్షన్ ఓరియెంటెడ్ ఫిలింలో.
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సాగతీత.. పెద్దగా అనిపించదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిటింగ్ కూడా బానే చేశారు.
అవసరమైన మేర, సినిమా కోసం ఖర్చు చేశారంటే, నిర్మాతల అభిరుచికి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. ఓవరాల్‌గా, ‘బ్లాస్ట్ జోన్’, టెక్నికల్‌గానూ అదరహో.
నిజానికి, ఇలాంటి సినిమాలు చాలా రిస్కీ. కానీ, దర్శక నిర్మాతలు బానే రిస్క్ తీసుకున్నారు. కమర్షియల్ సక్సెస్ అంటే, ఓటీటీ యాంగిల్‌లో సూపర్‌గా వుండొచ్చు.
మితిమీరిన హింస లేదు.. వల్గారిటీ అసలే లేదు. సకుటుంబ సమేతంగా చూసెయ్యొచ్చు ఈ ‘బ్లాస్ట్ జోన్’ సినిమాని. ఓసారి చూశాక, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
స్టంట్ కొరియోగ్రఫీ గురించి చాలా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. చాలా అందంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేశారు. చాన్నాళ్ళయ్యింది ఇలాంటి క్లీన్ యాక్షన్ మూవీ చూసి.
