Sharmila Jagan Family Politics.. కుమార్తె పెళ్ళి.! ఈ నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అందించడం సంప్రదాయం.!
వైఎస్ షర్మిల కూడా, వివాహ ఆహ్వాన పత్రికతో తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే తప్పేముంది.? మేనకోడలి పెళ్ళి కదా, వైఎస్ జగన్‌కి కూడా కొన్ని బాధ్యతలుంటాయ్.
సరే, రాజకీయంగా అలాగే ఆస్తుల పంపకాల పరంగా వైఎస్ జగన్ – వైఎస్ షర్మిల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. కోర్టు గొడవలూ వున్నాయి.
అంతమాత్రాన, కుమార్తె వివాహం నేపథ్యంలో వైఎస్ షర్మిల, తన సోదరుడు జగన్‌కి ఆహ్వాన పత్రిక అందించడం తప్పెలా అవుతుంది.?
అయితే, జగన్ – షర్మిల రాజకీయంగా ఒక్కటయ్యేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందంటూ వైసీపీ శ్రేణుల్లో ఓ వర్గం, విశ్లేషిస్తోంది. ఈ మేరకు తమ తమ అభిప్రాయాలని కుండబద్దలుగొడుతున్నాయి.
Sharmila Jagan Family Politics.. ఆహ్వానిస్తున్నారు.. తూలనాడుతున్నారు కూడా.!
జగన్, షర్మిల కలిసిపోతే, తెలుగునాట రాజకీయాల్లో కొత్త సంచలనం.. అంటూ వైసీపీ శ్రేణుల్లో ఆ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
మరికొందరు వైసీపీ కార్యకర్తలు మాత్రం, షర్మిలని తూలనాడుతున్నారు. ఆమెపై తమ ద్వేషాన్ని సోషల్ మీడియా వేదికగా చాటుకుంటున్నారు.
ఇదిలా వుంటే, వైసీపీ అను‘కుల’ మీడియాలో, రకరకాల విశ్లేషణలు రోతపుట్టిస్తున్నాయి ఈ అంశంపై. ఈ నేపథ్యంలో అన్ని వివాదాలకూ ఫుల్ స్టాప్ పెట్టాలనే కోణంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు షర్మిల.
నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు, నా మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం.
జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా.
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని నేను చివరిసారిగా కలిసింది నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే.
మళ్లీ ఇప్పుడు కలిసినా.. నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే.
అన్ని రాజకీయ పార్టీల అధినేతలను నా బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానిస్తాను. ఇందులో కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ YSR బిడ్డగా నాకు లేదు.
శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి, నా విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదు.
నా బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ.. ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయ పూర్వక ఆశీస్సులు అందించాలని కోరుతున్నా.
ఇదీ షర్మిల స్పందన.! అయితే, వివిధ రాజకీయ పార్టీల అధినేతల్ని కలిసినట్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిసి శుభ లేఖ ఇస్తానని షర్మిల చెప్పడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
సరే, జగన్ – షర్మిల మధ్య వున్న విభేదాల తీవ్రత నేపథ్యంలో షర్మిల, ఈ నిర్ణయం తీసుకుని వుండొచ్చు. ఇది షర్మిల – జగన్ మధ్య వున్న కుటుంబ సమస్య మాత్రమే.
ఏమో, చెల్లెలి ఆహ్వానాన్ని మన్నించి మేనకోడలి పెళ్లిలో వైఎస్ జగన్ ప్రధాన ఆకర్షణ అయితేనో.!
