Table of Contents
Valentines Day.. పొద్దున్న పుట్టే ప్రేమ సాయంత్రానికి మాయమైపోతున్న రోజులివి. అయినా ప్రేమించాలి. తప్పదు. ఎందుకంటే, ప్రేమించకపోతే యూజ్‌లెస్ అనే భావన పెరిగిపోయింది. ప్రేమంటే, ఖరీదైన గిఫ్టు. కుదరకపోతే ఏదో ఒక చిన్న బహుమతి. అంతేనా.? ఇప్పుడైతే అంతే.
ఈ సృష్టిలో అన్నింటి కన్నా గొప్పది ప్రేమ. చచ్చేదాకా కలిసుంటామనే నమ్మకం ఇద్దరు వ్యక్తుల మధ్య కల్పించాల్సిన ప్రేమ, అవసరం తీరిపోగానే మాయమైపోతోంది. ప్రేమ మనుషుల్ని పిచ్చోల్ని చేస్తుంది. ఆ ప్రేమ చేయించే దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
Valentines Day.. ఏది ప్రేమ.. ఎవరిది నిజమైన ప్రేమ.?
బాల్యం దాటగానే ప్రేమ గుర్తుకొచ్చేస్తోంది చాలా మందికి. ఆగండాగండి.. పుట్టగానే ప్రేమించేయడం మొదలెట్టేస్తున్నారిప్పుడు. ప్రేమ పుట్టడం తేలికే. ఆ ప్రేమ చచ్చిపోవడం కూడా తేలికే. పద్దెనిమిదేళ్లో, పాతికేళ్లో పెంచిన తల్లితండ్రులది ప్రేమ కాదు. అమ్మాయి కైపుగా నవ్వితే అమ్మాబాబుల్ని పాతరేయడమే ప్రేమ.
అబ్బాయి పర్సు గట్టిగా కనబడితే, అమ్మాయి చూపే ప్రేమ కూడా అలాగే వుంటుంది.

నిజానికి ప్రేమ చాలా చాలా గొప్పది. ఇందులో ఇంకో మాటకి తావు లేదు. ప్రేమ ఓ అద్భుతం. ప్రేమ అంటే ఏంటీ.? అని వర్ణించడానికి ఎవరి స్థాయీ సరిపోదు. తల్లితండ్రుల ప్రేమ, తోడబుట్టిన వాళ్ల ప్రేమ.. నిజంగా ప్రేమిస్తే ప్రియురాలు, లేదా ప్రియుడి ప్రేమ ఇవన్నీ గొప్పవే.
ట్రెండీ ప్రేమ.! దోపిడీ, కక్కుర్తి తప్ప ప్రేమెక్కడ.?
కానీ, ఈ మారిన కాలంలో నిజమైన ప్రేమ అంటేనే ఓ నాన్సెన్స్. అయినా ప్రేమించేయాలి. ప్రేమికుల రోజు వచ్చిందంటే పండగ చేసుకోవాలి. కక్కుర్తి కాకపోతే, సంవత్సరంలో 365 రోజులు లేవా.? ఒక్కరోజే ఎందుకు చిత్త కార్తి కుక్కల్లా పెచ్చిపోయి ప్రేమించేసుకోవాలి.
ఏం.. ప్రేమించుకునే స్వేచ్ఛ మాకు లేదా.? అని నేటి యువతరం ప్రశ్నించొచ్చుగాక. ఎందుకు లేదు బ్రహ్మాండంగా ప్రేమించుకోవచ్చు. కానీ, నిన్న మొదలైన ప్రేమ రేపు ముగిసిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది.?
ప్రేమించి, పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత కొన్నాళ్లు కలిసి బతకలేకపోతున్నాం.. కాబట్టి, విడిపోయి స్నేహితుల్లా వుంటాం.. అని చెబుతుంటే, కడుపుకి అన్నం తినేవాళ్లెవరైనా ప్రేమని నమ్మగలరా.?
ఇది ప్రేమ కాదు.. పైత్యం.!
జరుగుతున్న కథ వేరే. ప్రేమ వేరు. ప్రేమ పేరుతో నడుస్తున్న పైత్యం వేరు. ప్రేమికుల రోజు వచ్చేసింది. ఏడాదికోసారి వస్తూనే వుంటుంది. ఖరీదైన గిఫ్టుల కోసమో, ఇంకోదాని కోసమో అంతే. నిజానికిది ప్రేమికుల దినోత్సవం కాదు. ప్రేమ ముసుగులో ఓ పనికిమాలిన సెలబ్రేషన్ అంతే.!
Also Read: నయా ట్రెండ్.. విడాకులూ బ్రేకప్పూ వాట్సప్పూ.?
నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది. జీర్ణించుకోవడం చాలా చాలా కస్టం. చాలా మంది ఈ నిజంతో ఏకీభవించకపోవచ్చుగాక. ఏకీభవించకపోతేనే ఈ ‘ప్రేమ’ అనే ట్రెండీ పైత్యం మాయలో మునిగి తేలినట్లు. ఏకీభవిస్తే, నిజమైన ప్రేమ గురించి కాస్తో కూస్తో అవగాహన వున్నట్టు.!
ప్రేమించడం వేరు, ప్రేమించామని అనుకోవడం వేరు. ఒక్కసారి ప్రేమిస్తే.. శరీరం నుంచి ప్రాణం పోయేదాకా ఆ ప్రేమ అలాగే వుంటుంది. కానీ, అది స్వచ్ఛమైన ప్రేమ విషయంలోనే జరుగుతుంది. కానీ, ఇప్పుడు మనం చూస్తున్న ప్రేమలు వేరు.! నిజమైన ప్రేమికులకి ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కరోజు సరిపోతుందా.? సరిపోదుగాక సరిపోదు.!
అలాంటి నిజమైన ప్రేమికులకి ప్రతి రోజూ ప్రేమికుల రోజే (Valentines Day).!