Singeetham Srinivasa Rao Celluloid Scientist.. సినిమా అంటేనే ‘సిత్రం’.! అందునా, సింగీతం సినిమా అంటే, ఇంకా ఇంకా ‘సిత్రం’.!
సింగీతం శ్రీనివాసరావు.. సగటు సినీ అభిమానికి, సింగీతం అనే పేరు సుపరిచితమే. సింగీతం పేరు చెప్పగానే, ‘పుష్పక విమానం’ గుర్తుకొస్తుంది ముందుగా.!
మరి, ‘ఆదిత్య 369’ సినిమా సంగతేంటి.? ‘భైరవ ద్వీపం’ సినిమాని ఎలా మర్చిపోగలం.? చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.!
కొన్ని ఫ్లాప్ సినిమాలూ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు చవిచూశారు. తొంభై ఏళ్ళు పైబడ్డాక కూడా, ‘సింగ్ గీతం’ అనే సినిమాని తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు.
మాట పడిపోయి.. ఆ మాట స్థానంలో పాటలు మాత్రమే వస్తే.? ఇదీ, ‘సింగ్ గీతం’ సినిమా. ఆలోచన అదిరింది కదూ.! ఈ ఆలోచనే చాలామందిని ఆశ్చర్యపరిచింది.
తొంభై నాలుగేళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమాని తెరకెక్కించారు. ఆషామాషీ విషయమేమీ కాదిది. వీల్ ఛెయిర్ మీదనే వుండి, వర్క్ ఫ్రమ్ హోం తరహాలో ఈ సినిమా చేశారాయన.
ఆ సింగీతం ఇక లేరు.! వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో నిన్న తుదిశ్వాస విడిచారు సింగీతం శ్రీనివాసరావు. అదేంటీ, మొన్ననే కదా.. నవ్వుతూ కనిపించారు.. అని, చాలామంది సినీ జనాలు సింగీతం మరణ వార్తపై విస్తుపోతున్నారు.
అసలు, ‘పుష్పక విమానం’ సినిమాని అలా తెరకెక్కించాలనే ఆలోచన ఎలా వచ్చినట్లు.? ‘ఆదిత్య 369’ సినిమాకి ఆ కాన్సెప్ట్ ఎలా రాసుకున్నారు.? ఇలా అందరూ అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నారు.
అన్నట్టు, నందమూరి బాలకృష్ణ – సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఇంకో సినిమా రావాల్సి వుంది. దాని కోసమే కసరత్తులు నడుస్తున్నాయి.
కథ విషయమై సింగీతంతో, బాలకృష్ణ చర్చలు జరుపుతూనే వున్నారు. అదీ, తన కుమారుడి తెరంగేట్రానికి సంబంధించి. దురదృష్టవశాత్తూ, ఇంతలోనే ఇలా జరిగింది.
తొంభై నాలుగేళ్ళ వయసులో యువకుడిలా తనువు చాలించారు సింగీతం శ్రీనివాసరావు.. అంటూ, విశ్వ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తనను తాను సింగీతం శిష్యుడిగా చెప్పుకోవడానికి కమల్ హాసన్ గర్వపడతారు. ఎందరో మహానుభావులు.. అందులో, సింగీతం శ్రీనివాసరావు ఒకరు.
భారతీయ సినిమా.. ఓ గొప్ప దర్శకుడిని, కథా రచయితనీ కోల్పోయింది. సింగీతం విజనరీ.. సింగీతం సిల్వర్ స్క్రీన్ సైంటిస్ట్.!
