Beggar MLA Parag Shah.. ‘బిచ్చగాడు’ సినిమా చూసే వుంటారు మీలో చాలామంది.! కోట్ల రూపాయల ఆస్థి వున్నా, బిచ్చగాడిలా మారతాడు ఆ సినిమాలో హీరో.!
నిజానికి, సినిమా కథలు గాల్లోంచి పుట్టవు. వాటిల్లో చాలావరకు నిజ జీవిత గాధలే.! కాకపోతే, కొంచెం కమర్షియల్ టచ్ ఇస్తుంటారంతే.!
పాండవులు వన వాసం గురించి మనకి తెలుసు. రామలక్ష్మణులు అడవి బాట పట్టడం కూడా తెలుసు మనకి.! ఇవన్నీ మనిషి ఎలా బతకాలో చెబుతాయ్.
ఇక్కడ ఇప్పుడు ఓ మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులున్న ఓ బిచ్చగాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
అతనొక ఎమ్మెల్యే.. అతనొక వ్యాపారవేత్త.! మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఇక్కడ ఈ కథలో కథానాయకుడు.! ఇది కథ కాదు. నిజం.!
ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు పరాగ్ షా, జైన సంప్రదాయంలో ఓ నెల రోజులపాటు బిచ్చగాడిగా మారారు. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో బిచ్చమెత్తుకుని తిరిగారాయన.
పరాగ్ షా బిచ్చగాడిలా మారి, వీధుల్లో బిచ్చమెత్తుకోవడానికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిచ్చగాడిలా మారి, జనం వద్దకు వెళ్ళినప్పుడు సాధారణ ప్రజానీకం చాలా గొప్ప వ్యక్తుల్లా నాకు కనిపించారు. అదే ఎమ్మెల్యేగా వున్నప్పుడు, ఆ ప్రజల నుంచి నాకు లభించే గౌరవ మర్యాదలు వేరు.. అని చెప్పారాయన.
ముంబై ప్రజల్లో మంచి ఇంకా బాగా తనకు బిచ్చగాడిగా వున్నప్పుడు తెలిసిందనీ, వారు ఇతరులకు చేసే సాయం చాలా గొప్పదనీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
బిచ్చమెత్తుకుంటూ, రోడ్ల మీదనే పడుకుంటూ తాను గడిపిన జీవితం, తనకెప్పుడూ గుర్తుంటుందనీ, తనను అహంకారానికి దూరంగా వుంచేలా తనను అప్రమత్తం చేస్తుందనీ చెప్పారు ఎమ్మెల్యే పరాగ్ షా.
ఇదొక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే.. అనేవారూ లేకపోలేదు. అది వేరే సంగతి.! ఆయన దృష్టిలో బిచ్చమెత్తుకోవడం అనేది దైవ కార్యంతో సమానమే.
