Table of Contents
Goa Shree Bethal Temple.. చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుడు – బేతాళుడు కథలు చాలానే విన్నాం. చదివాం.
రాజు విక్రమార్కుడు, బేతాళుడిని తన భుజాలపై మోస్తూ.. భేతాళుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ వుంటాడు.
ఒకవేళ రాజు సమాధానం చెప్పలేకపోతే అక్కడికక్కడే తల తెగి చనిపోతాడంటూ.. బేతాళుడు రాజుని హెచ్చరిస్తున్నట్లుగా ఆయా కథల్లో సారాంశం వుంటుంది.
అలా బేతాళుడిని ఓ దెయ్యంలా, భూతంలా, ప్రేతాత్మలా భావిస్తుంటాం. కానీ, ఇక్కడ బేతాళుడిని దేవుడిగా.. తమ గ్రామాానికి రక్షకుడిగా భావించి పూజలు చేస్తారు.
ఇంతకీ ఎక్కడ ఆ ప్రాంతం.? ఈ విచిత్రమైన దేవాలయం వివరాలేంటీ.? తెలుసుకుందాం.
గోవాలోని ’అమోనా (Amona) గ్రామంలో వుంది ఈ ప్రత్యేకమైన బేతాళ్ దేవాలయం. ‘శ్రీ బేతాళ్ టెంపుల్’గా ఈ ఆలయాన్ని పిలుస్తారు.
Goa Shree Bethal Temple.. గ్రామ రక్షకుడు ఇక్కడి బేతాళుడు.!
తమ ఊరికి ఎలాంటి చీడ పీడల బెడద లేకుండా వుండేందుకు ఇక్కడి బేతాళుడిని దైవంగా కొలుస్తారు స్థానికులు. ప్రజలు నిద్ర పోయాకా బేతాళ స్వామి రాత్రిళ్లు తమ గ్రామానికి రక్షకుడిగా వుంటాడని నమ్ముతారు.
సాధారణంగా హిందూ సాంప్రదాయంలో అయితే, బేతాళుడిి దయ్యాల రాజుగా భావిస్తారు. బేతాళుడి పేరు తలిస్తేనే భయపడతారు.
కానీ, గ్రామ రక్షకుడిగా బేతాళుడిని గోవాలోని అమోనా ప్రాంత ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో పూజించడం విశేషం.
ఈ దేవాలయంలోని గర్భ గుడిలో బేతాళుడి రూపం నల్లటి ఆకృతిలో పెద్ద పెద్ద కళ్లు కలిగి వుంటుంది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో పుర్రో కలిగి వుంటుంది. మెడలో రుడ మాల ధరించి దర్శనమిస్తాడు బేతాళుడు.
విచిత్రమైన నైవేద్యం.!
సహజంగా దేవాలయానికి వెళ్లినప్పుడు పూలు, పండ్లు, కొబ్బరి కాయలు వంటివి దేవుడికి నైవేద్యంగా తీసుకెళుతుంటాం. కానీ, ఇక్కడ బేతాళుడి నైవేద్యం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.
పాద రక్షలను ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు బేతాళుడికి. అలాగే, గంజాయి, మధ్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
పాదరక్షలతో అసలు దేవాలయంలోకి అడుగే పెట్టము. కానీ, ఇక్కడ దేవుడికి నైవేద్యమే ‘పాదరక్షలు’ కావడం అత్యంత వింతైన ఆచారం.
ఈ పాదరక్షలు ధరించి గంజాయి, మద్యం సేవించి బేతాళ స్వామి రాత్రిళ్లు తమ గ్రామానికి రక్షకుడిగా వుంటాడనీ స్థానికులు బలంగా విశ్వసిస్తారు.
చెప్పులు పాతబడిపోతాయట.!
అప్పుడప్పుడూ ఆయనకు నైవేద్యంగా సమర్పించిన పాదరక్షలు మాసిపోయి తెగిపోయి దుమ్ము ధూళితో పాతబడిపోయి వుండడం కూడా గమనించామని అక్కడి స్థానికులు చెబుతుంటారు.
అంటే, ఖచ్చితంగా తాము నైవేద్యంగా సమర్పించే పాదరక్షలు ధరించే బేతాళుడు రాత్రిళ్లు తిరుగుతాడనీ, తమ గ్రామాన్ని కాపాడుతుంటాడనీ జనం గట్టిగా నమ్ముతుంటారు.
తమ స్తోమత కొద్దీ కొందరు తోలు చెప్పులు సమర్పిస్తారు. అలాగే, మరికొందరు, వెండి, బంగారు పాదుకలు సైతం నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి.?
గోవాలోని అమెనా గ్రామంలో వున్న ఈ ప్రసిద్ధ బేతాళ దేవాలయానికి చేరుకోవాలంటే రైలు మార్గం అత్యంత అనుకూలమైనదిగా తెలుస్తోంది.
గోవాలోని ప్రధాన రైల్వే స్టేషన్ ధివిమ్ నుండి 16 లేదా 18 కిమీ దూరంలో అమోనా గ్రామం వుంటుంది.
అలాగే, మడ్గావ్ జంక్షన్ లేదా కర్మాలి స్టేషన్ నుంచి కూడా అమోనా గ్రామం చేరుకోవచ్చు. ఈ స్టేషన్ నుంచి దాదాపు 22 కిమీ దూరంలో అమోనా గ్రామం వుంటుంది.
రోడ్డు మార్గంలో పనాజీ బస్ స్టాండ్ నుంచి అమోనా సుమారు 20 నుంచి 22 కిమీ దూరం వుంటుంది.
