Table of Contents
Mehandipur Balaji Temple.. దేవుడు వుంటే, దెయ్యం కూడా వున్నట్లే.. అంటారు కదా.! ఈ మధ్య హారర్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు బోలెడంత క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాల కథా నేపథ్యం భూత, ప్రేతాలే.
ఒక ఊరు, లేదా ఒక మనిషి భూతాలతో పీడింపబడడం.. ఓ సాధువు లేదంటే, దేవుడికి పరమ భక్తులైన మరో వ్యక్తి (హీరో లేదా హీరోయిన్) ఆ ఆత్మలకు సంబంధించిన స్టోరీ తెలుసుకుని వాటికి విముక్తి కలిగించడం..
వీటికి సాంకేతికంగా హారర్ బ్యాక్ డ్రాప్ జోడించి ప్రేక్షకులు మెచ్చే విధంగా గ్రిప్పింగ్‌గా కథనం నడిపించడమే హారర్ సినిమాల ప్రధాన లక్ష్యం.
మరి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కథనం ఏంటో తెలుసా.?
రియల్ లైఫ్‌లోనే భూత, ప్రేతాలకు విముక్తి కలిగించే ఓ ఆలయం ఇతివృత్తాంతం. అలాంటి ఆలయం ఎక్కడుంది.? అక్కడ ఏం చేస్తారు.? తెలుసుకుందాం పదండిక.!
Mehandipur Balaji Temple.. ఆలయంలో వింత వాతావరణం:
రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయంలో భూత, ప్రేతాలతో బాధపడేవారికి విముక్తి కలిగిస్తారు.
అంటే, దయ్యం పట్టిన వారికి విముక్తి కలిగించి, ఆ ఆత్మలకి అక్కడే శాశ్వత స్థానం కల్పించే క్షేత్రంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ ‘మెహందీపూర్ బాలాజీ’ టెంపుల్ వుంది. ఇక్కడి గుడిలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్లు వుంటారు.

అందులో ఒకరు శ్రీ బాలాజీ. పేరుకు బాలాజీ అయినా హనుమంతుడి రూపంలో ఈయన మాకు దర్శనమిస్తారు.
రెండవ దేవుడు భైరవనాధుడు. మూడో దైవం ప్రేతరాజ్ సర్కార్.. ప్రేతాత్మలకు రాజుగా ఈయన్ని భావిస్తారు.
ప్రేతాత్మలకు శిక్షలు వేస్తారు.!
ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకంగా ఓ దర్బార్ హాల్ వుంటుంది. ప్రేతరాజ్ దర్బార్‌గా పిలుస్తారు దీన్ని. ఇక్కడ ప్రేతరాజు చెడు శక్తులు, పిశాచాలు, దెయ్యాలకు అధిపతిగా వుంటారు.
దెయ్యాలు పట్టిన వారికి, చెడు శక్తులు ఆవహించిన వారిని ఈ దర్బార్‌లో ప్రవేశపెడతారు. ప్రేతరాజు సమక్షంలో ప్రత్యేక విచారణ జరిపి ఆయా క్షుద్ర శక్తులకు విముక్తి కలిగిస్తారనీ, శిక్షలు కూడా వేస్తారనీ స్థానికుల విశ్వాసం.
ఆలయంలో అడుగు పెట్టగానే వింతైన (హారర్) అనుభూతికి లోనవ్వాల్సి వస్తుంది. వింతగా అరవడం, తలలు బాదుకోవడం.. గొలుసులతో కట్టేసి వుండడం వంటి దృశ్యాలు భయానకంగా కనిపిస్తాయ్.
అది మాత్రం మర్చిపోవద్దు.!
ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. అక్కడే తినేయాలి. లేదా అక్కడే పడేయాలి. ప్రసాదమే కాదు.. ఈ ఆలయం నుంచి ఏ వస్తువూ వెంట తెచ్చుకోకూడదు.
ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా తిరిగి చూసినా.. అక్కడి నుంచి ఏదైనా వస్తువు వెంట తెచ్చుకున్నా.. చెడు శక్తులు వెంట వస్తాయని నమ్ముతారు.
దేవాలయం నుంచి బయటికి రాగానే అక్కడికి దగ్గరలో వున్న కొలనులో స్నానం చేసి, లేదా కాళ్లు, ముఖం కడుక్కుని మాత్రమే ఇంటి బాట పట్టాలట.
ఈ విషయం అస్సలు మర్చిపోారాదని అక్కడి స్థానికులు కాస్త గట్టిగానే చెబుతుంటారు.. కాదు, హెచ్చరిస్తుంటారు.
