Bhogapuram Airport Uttarandhra Growth Engine.. ఉత్తరాంధ్ర.. వెనకబడ్డ ప్రాంతం.! కాదు, అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం.!
లేకపోతే, ఉద్దానం అనే ప్రాంతాన్ని దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలు వేధిస్తోంటే, ప్రభుత్వాలెందుకు ఆలస్యంగా కళ్ళు తెరిచాయ్.!
అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన వుంటుంది ఉత్తరాంధ్ర పరిస్థితి.! సుదీర్ఘ తీర ప్రాంతం.. ఆపై, విశాఖ లాంటి అద్భుత నగరం.. జాతీయ రహదారులు.. రైల్వే లైన్.. ఇన్ని వున్నా, వెనకబడ్డ ప్రాంతమెందుకయ్యింది ఉత్తరాంధ్ర.?
గతం గతః ఇకపై పరిస్థితులు మారబోతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే, ఈ ప్రాంతం నుంచి ప్రపంచం నలు మూలలకీ వలసలు.. అనే గుర్తింపు వుండేది.
కానీ, ఇక నుంచి.. ఆ వలస పక్షులన్నీ.. తిరిగి తమ ఉత్తరాంధ్రకు సగర్వంగా తిరిగొచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది.
ఉత్తరాంధ్ర వైభవం గురించి ఇకపై ఘనంగా.. చాలా ఘనంగా మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రారంభోత్సవం వల్లనే.!
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భోగాపురంలో అత్యాదునిక సౌకర్యాలతో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడి నుంచే నేరుగా విదేశాలకు వెళ్ళొచ్చు.. విదేశాల నుంచి నేరుగా ఇక్కడికే రావొచ్చు. వావ్.. చదువుతుంటూనే, అద్భుతంగా వుంది కదా.!
విమానాశ్రయం అంటే, కేవలం డబ్బున్నోళ్ళ ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారం కాదు. కార్గో అత్యంత కీలకం. పర్యాటకం ఇంకా కీలకం. చెప్పుకుంటూ పోతే చాలానే.
ఇక్కడే, ఈ ప్రాంతం చుట్టూనే అభివృద్ధి పరుగులు పెట్టనున్నాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరిగితే, ఎక్కడికో వలస వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది.?
ఉత్తరాంధ్ర ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా పరిచయమవుతాయి. ఉత్తరాంధ్రలోని పర్యాటక ప్రాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా వున్న పర్యాటకుల్ని ఆకర్ఫిస్తాయి.
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితమవుతోంది ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. అనేకానేక వివాదాలు, రాజకీయ కుట్రల నడుమ.. పురుడు పోసుకుందిప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క. ఉత్తరాంధ్రకి గుండెకాయలా మారనుంది ఇక నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.
విశాఖ నగరానికి 45 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 25 కిలోమీటర్లు.. శ్రీకాకుళం నుంచి 55 కిలోమీటర్లు.. ఇదీ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు ముఖ్యమైన పట్టణాల నుంచి దూరం.
ఎట్నుంచి అయినా ప్రయాణం జస్ట్ గంట లోపు మాత్రమే. రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పడాలి. మెట్రో రైల్ కూడా ఈ మూడు పట్టణాల్ని భవిష్యత్తులో కలపగలిగితే.. అదింకా అద్భుతమే.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశానికే అభివృద్ధి కోణంలో రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉత్తరాంధ్రకి భోగాపురం విమానాశ్రయం రాకతో వచ్చిందన్నది నిర్వివాదాంశం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంపై ఎంత ఎక్కువ ఫోకస్ పెడితే, అంత అద్భుతంగా మారబోతోంది ఉత్తరాంధ్ర.! ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం.. సుస్వాగతం.!
